అధికారుల ఆదేశాలు బేఖాతరు...! | - | Sakshi
Sakshi News home page

అధికారుల ఆదేశాలు బేఖాతరు...!

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

నిలిచిన అన్నదాన కార్యక్రమం

తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వివాదాస్పద

నిర్ణయాలు

గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ట్రస్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని దేవదాయ శాఖ అధికారులు ఈ నెల 4న జారీ చేసిన ఆదేశాలు పట్టించుకోకుండా దేవస్థానం పరిధిలో కార్యక్రమాలను కొనసాగించడం వివాదస్పదంగా మారింది. తోటపల్లి గ్రామంలో ముగ్గురు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బయటకు చెబుతున్నా.. ట్రస్టు సభ్యుల కనుసన్నల్లోనే అన్నదానం జరుగుతుందని పలువురు చెబుతున్నారు. దీని నిర్వహణపై ఆలయాన్ని శనివారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు సందర్శించి పరిశీలించారు. ఆహార పదార్ధాల తయారీ, పంపిణీ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతి లేకుండా ఇతరులు వంట గదుల్లోకి ప్రవేశించడం తదితర అంశాలను గుర్తించారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రాధమిక నిబంధనలు సైతం పాటించకపోవడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. అన్నదాన నిర్వహణపై అధికారులు నిర్వాహకులను ప్రశ్నించడంతో ట్రస్టు సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఇచ్చిన పత్రాలను సభ్యులు చించేసి అధికారులను అవమానకరంగా దూషించారు. అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆలయ ఈఓను ప్రశ్నించారు. దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించకుండా.. దాతల సహకారంతో నిర్వహిస్తే ఒప్పుకోకుండా ఏంటీ పరిస్థితి అని నిలదీశారు. భక్తులు ఆకలితో ఉండాలా? అని పలువురు భక్తులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి ట్రస్టు కార్యకలాపాలను కొనసాగించడం, అన్నదాన కార్యక్రమాల్లో ఆహార భద్రత ప్రమాణాలను విస్మరించడం, విధి నిర్వహణలో ఉన్న అధికారులతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం అన్నదాన కార్యక్రమాల్లేవు..

ఆలయంలో ప్రస్తుతం ఎటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీనికి దేవదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌’ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతుల్లేవు. భక్తులు, యాత్రికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.

– వీవీ సూర్యనారాయణ, ఇన్‌చార్జ్‌ ఈఓ,

తోటపల్లి దేవస్థానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement