విజయనగరం అర్బన్: మండల స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలకు క్షేత్ర స్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పశు సంవర్ధక శాఖల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ లబ్ధిదారులకు మేలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాదికి కనీసం 4 వేల పశుకిసాన్ క్రెడిట్ ఖాతాలను ఓపెన్ చేయించాలని పశుసంవర్ధక శాఖ జేడీని ఆదేశించారు. ‘ఎల్‌నినో’ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పశు సంపదను పెంచుకోవాల్సిన అసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు ఉపకరించేలా విరివిగా పశువుల రుణాలను అందజేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులందరూ ‘కృషికా’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా పంట రుణాల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చాలా సులువుగా జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి వేలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ వార్షిక లక్ష్యాలు, ప్రణాళికలు, వ్యూహాల వివరాలను వెంటనే నాబార్డుకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ వివరాల ఆధారంగా ఆయా శాఖలకు ఎంత మేరకు రుణ ప్రణాళిక అవసరమవుతోందో అంచనా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీడీ ఎం.నాగార్జున, మెప్మా, డీఆర్‌డీఏ పీడీ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జాయింట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రెవెన్యూ దినోత్సవం
విజయనగరం అర్బన్: ప్రజల నిత్య జీవితంలో రెవెన్యూ శాఖ ఒక కీలక భాగమని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకొని సమర్ధతను పెంచుకోవాలని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ సీహెచ్ సత్తిబాబు, ఏపీజేఏసీ ప్రెసిడెంట్ పి.ఆదిలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ బంగార్రాజు, ఏపీఆర్‌ఎస్‌ఏ ట్రెజరర్ కె.జోగినాయుడు, జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టర్ సూపరింటెండెంట్లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


