● అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ
● విద్య కాదు..వ్యాపారం!
విజయగనరం గంటస్తంభం: కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తక విక్రయాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు నారాయణ విద్యా సంస్థ ఎదుట శనివారం నిరసన తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని నారాయణ పాఠశాలలో పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అక్కడకు చేరుకుని విక్రయాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు జి.సూరిబాబు, కార్యదర్శి ఇ.వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని విమర్శించారు. అధిక ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరి చేస్తూ తల్లిదండ్రులై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి విద్యార్థుల కుటుంబాలను నిలువునా దోచుకుంటున్న విద్యా సంస్థలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గర్‌ల్స్’ కో – కన్వీనర్ భారతి, పట్టణ కమిటీ సభ్యులు మురళి, సతీష్, కృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


