● పోస్టల్ సూపరింటెండెంట్ బాబూరావు
బొబ్బిలి: గతేడాది పోస్టల్ బీమా పాలసీలను లక్ష్యానికి మించి సేకరించామని పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ ఏడాది లక్ష్యాలపై సమాయత్త సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతేడాది రూ.60 కోట్ల లక్ష్యం కాగా రూ.60 కోట్ల పాలసీలు సేకరించినట్టు చెప్పారు. ఈ ఏడాది రూ.110 కోట్ల లక్ష్యం విధించినట్టు చెప్పారు. రామభద్రపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో సబ్ పోస్టాఫీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ సేవలను మరింత అధికంగా అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమిదన్నారు. గతేడాది లక్ష్యాలను అధిగమించిన సిబ్బంది, అధికారులకు సూపరింటెండెంట్ చేతుల మీదుగా ప్రోత్సాహకాలు, ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు.


