గత ప్రభుత్వం చేపట్టిన పనులివి
ఇదీ తోటపల్లి రైతుల ఆవేదన
కాలువ పనులు రద్దు సరికాదు
నమ్మించి మోసగించారు
వీరఘట్టం/పాలకొండ: ‘తోటపల్లి ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు శరవేగంగా పూర్తి చేస్తాం.. రైతన్నకు సాగునీటి కష్టం లేకుండా సకాలంలో తోటపల్లి నీరు అందేలా చర్యలు తీసుకుంటాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు రైతులకు ఇచ్చిన మాట ఇది. అంతేకాకుండా సెల్ఫీ చాలెంజ్‌లు కూడా చేశారు. ఇలా మాయమాటలతో తోటపల్లి ఆయకట్టు రైతాంగాన్ని మోసగించి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక ఏరుదాటక తెప్ప తగలెట్టిన మాదిరిగా వీరి వైఖరి మారడంతో తోటపల్లి రైతులు భగ్గుమంటున్నారు.
కాసులు దండుకునే కుట్ర
2018లో ప్రారంభమైన తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు రూ.195 కోట్లు సరిపోతాయని జల వనరుల శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను రద్దు చేయడంతో జల వనరుల శాఖ అధికారులు రీ–ఎస్టిమేషన్ వేశారు. పెరిగిన జీఎస్టీ, సీనరీ చార్జీలు ఇలా అన్నింటిని కలుపుకుని గత ఎస్టిమేషన్‌కు 50 శాతం పెంచుతూ సుమారు రూ.97.5 కోట్లు పెంచుతూ రూ.292.5 కోట్లతో నూతన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. కేవలం ఎస్టిమేషన్ చార్జీలు పెంచి నిధులు కాజేసేందుకే తోటపల్లి కాలువల పనులను ప్రభుత్వం రద్దు చేసిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
అగమ్యగోచరంగా శివారు ప్రాంతం పరిస్థితి
ప్రతీ ఏటా పాలకొండ శివారు ప్రాంత పొలాలకు సకాలంలో నీరందించలేకపోవడంతో శివారు ప్రాంత భూముల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంటోంది. శివారు కాలువల్లో తుప్పలు, డొంకలు పేరుకుపోయి పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల ఇబ్బందులు గుర్తించి కాలువలను ఆధునికీకరించేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
తోటపల్లిపై చేసిన సెల్ఫీ చాలెంజ్‌లు ఉత్తివేనా..
ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రైతులు
మరోసారి రైతుల నోట వినిపిస్తున్న ‘నిన్ను నమ్మం బాబు’ ట్యాగ్‌లైన్
ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్లలేకపోతున్న జిల్లా ఎమ్మెల్యేలు
తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత కుడి, ఎడమ కాలువలు పరిధిలో 64 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17.616 కి.మీ పొడవున్న కుడి కాలువలో 9.3 కి.మీ వరకు కాంక్రీట్ పనులను చేపట్టారు. అలాగే 37.536 కి.మీ పొడవున్న ఎడమ కాలువలో 17.5 కి.మీ వరకు కాంక్రీట్, లైనింగ్ పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. 4 చోట్ల ఆక్విడేట్‌లు, బ్రిడ్జిలు నిర్మించారు. సుమారు రూ.35 కోట్లుతో చేపట్టిన ఈ పనులకుగాను కాంట్రాక్టర్‌కు రూ.34 కోట్లు వరకు బిల్లుల చెల్లింపులు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ పనులు 23.5 శాతం మాత్రమే జరిగాయనే సాకు చూపించి కుడి, ఎడమ కాలువల్లో జరుగుతున్న ఆధునీకీకరణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి నమ్మి ఓట్లు వేసిన ఆయకట్లు రైతాంగాన్ని మోసగించారని రైతులు మండిపడుతున్నారు.
అయ్యా.. సీఎం గారు...
జీవనది నాగావళి జలాలు తోటపల్లి కాలువల ద్వారా పంట పొలాలకు అందజేసి రైతులకు నీటి కష్టం తెలీకుండా సాగులో సాయం చేస్తున్నామన్నారు. తోటపల్లి జలాశయం పరిధిలో 64 వేల ఎకరాల పాత ఆయకట్టుకు నీరందిస్తున్న మా కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు శరవేగంగా చేపడతామని చెప్పి ఈ ప్రాంత రైతుల ఓట్లు దండుకున్నావు. తీరా మీరు సీఎం అయిన తర్వాత ఆ హామీని మట్టిలో కలిపేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు 25 శాతం కూడా జరగలేదనే సాకు చూపించి సక్రమంగా జరుగుతున్న ఆధునికీకరణ పనులను రద్దు చేశారు. మిమ్మల్ని నమ్మిన రైతులను మోసగించారు, ఇదేనా... మీ 40 ఏళ్లు రాజకీయ అనుభవం అంటూ తోటపల్లి రైతులు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు.
తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టు జిల్లాకే తలమానికం. అటువంటి ఆయకట్టుకు నీరందించే కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులను రద్దు చేయడం చాలా అన్యాయం. రద్దు చేసిన పనులు వెంటనే చేపట్టాలి. వచ్చే ఖరీఫ్‌లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కాలువల ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలి.
– కె.వెంకటరమణమూర్తి, రైతు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, తూడి గ్రామం, వీరఘట్టం
గత ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తోటపల్లి ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులను రద్దు చేసి రైతులను మోసగించారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోతే కూటమి ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమౌతున్నారు.
– కర్రి లీలాప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ, వీరఘట్టం


