దోమా.. దోమా.. ఎక్కడ నక్కావ్‌! | - | Sakshi
Sakshi News home page

దోమా.. దోమా.. ఎక్కడ నక్కావ్‌!

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 7,891 కేసులు నమోదైతే.. ఈ రెండు జిల్లాల్లోనే 6,347(80.43శాతం)వెలుగు చూశాయి.

2025లో 7,119 మలేరియా కేసులు నమోదు కాగా.. అల్లూరి జిల్లాలో 3,153, మన్యం జిల్లాలో 1,820 చొప్పున నమోదవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్త కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే 69 శాతం వరకు ఉన్నట్లు వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల్లో మన్యం జిల్లా రికార్డు సృష్టిస్తుండటం ఆందోళన కలిగించే విషయమే. గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికంగా మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లో గిరిజనుల నివాసం.. వాతావరణ మార్పులు మలేరియా తీవ్రతకు కారణంగా ఉంది. జ్వరం వచ్చి రక్త పరీక్షలు చేయిస్తే చాలు.. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటివేనని తేలుతున్నాయి.

‘లార్వా వేట’తో దోమలకు చెక్‌

సీజనల్‌ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా ‘లార్వా వేట’, ‘వాగు వెంబడి’ వంటి వినూత్న కార్యక్రమాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మంచినీటిలో పెరిగే దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం దీని ప్రధాన ఉద్దేశం. కొద్ది నెలలుగా ‘మా ఊరికి మలేరియా వద్దు’, ‘ఫ్రైడే–డ్రై డే’ వంటి కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపడుతోంది. జిల్లాలో 243 మలేరియా ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు దోమ తెరల పంపిణీ ఆశించిన స్థాయిలో కావడం లేదు. ఏటా లక్షల్లో దోమ తెరలు అవసరం కాగా.. పంపిణీ వేలల్లోనే ఉంటోంది.

కేసులు తగ్గించేందుకు చర్యలు

గతంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేవి. కొద్ది నెలలుగా చేపడుతున్న చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మలేరియా శాశ్వత నివారణకు వంధ్యత్వ మగ దోమలను విడుదల చేసి దోమల ఉత్పత్తిని నివారించాలని భావిస్తున్నారు. వంధ్యత్వ మగ దోమ ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేక లేబొరేటరీని జిల్లాలో ఏర్పాటు చేయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement