పార్వతీపురం: విపత్తు నిర్వహణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రపంధన్ పురస్కార్ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ముందస్తు హెచ్చరికలు, రక్షణ చర్యలు, పునరావాసం, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక అవగాహన వంటి రంగాలో సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వాలంటీర్ బృందాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కౌశలం అభ్యర్థులకు విశాఖలో
ప్రత్యేక ఉద్యోగ మేళా
జిల్లాలో కౌశలం ప్రోగ్రాంలో అసెస్‌మెంట్లు పూర్తి చేసిన 167మంది అభ్యర్థుల కోసం ఈ నెల 18 నుంచి 21 వరకు విశాఖపట్నంలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్, గవరపాలెం, కంచరపాలెం ప్రాంతాల్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ఈవీ–2 వీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మొబైల్ అసెంబ్లీ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్, ఇన్‌ఫోసిస్ వాయిస్/నాన్‌వాయిస్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, అభ్యర్థులు ఆధార్, రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఫొటోలు వెంట తీసుకువెళ్లాలని సూచించారు.
జూన్ 15 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ
పార్వతీపురం: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారని, జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఆగస్టు 20వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఎం
పార్వతీపురం రూరల్: అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వైఖరి వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పేర్కొన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం పెరగడం వల్ల ఇరాన్, వెనిజులా వంటి దేశాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి రష్యా, ఇరాన్‌ల నుంచి చౌకగా లభించే చమురు, గ్యాస్ వనరులను వదులుకోవడం వల్లే దేశంలో ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల తలెత్తాయని అభిప్రాయపడ్డారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతూ, దేశీయంగా రైతులు పండించిన మొక్కజొన్న, పత్తి, రొయ్యలు వంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎరువుల ఉత్పత్తిని నిర్లక్ష్యం చేసి విదేశాలపై ఆధారపడటం వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నా రు. దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణ మని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్‌లను అమలు చేస్తున్నాయని పేర్కొంటూ, వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు వి.ఇందిర, ఎన్.వై.నాయు డు, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, కె.సాంబమూర్తి, బి.వి.రమణ, ఈశ్వరరావు పాల్గొన్నారు.


