చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు..! | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు..!

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

సాలూరు: రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర దుయ్యబట్టారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. యుద్ధ కారణాలను సాకుగా చూపుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల అన్ని రంగాలపై ఆ ప్రభావం పడి ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నేడు మరిచారన్నారు. గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో యూరియా కోసం రైతులు రోడ్లపై పడిన బాధలు ఎవరూ మరచిపోలేరన్నారు. కూటమి నేతలు గతంలో వైఎస్సార్‌సీపీ పాలనలో బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌లు కాన్వాయ్‌లు తగ్గించామని ప్రచారం చేసుకుంటూ ఒకొక్కరు ఒక్కో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటా.. ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికం

ప్రజలపై భారాలు మోపడమే చంద్రబాబు పని

మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

Advertisement
 
Advertisement
Advertisement