గిరిజన విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థిని మృతి

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని మూలిగూడ గ్రామానికి చెందిన పత్తిక సుస్మిత (13) శ్రీకాకుళంలోని రాగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 6వ తరగతి చదివిన సుస్మిత వేసవి సెలవులకు ఇంటికి వెళ్లింది. సుస్మితకు నాలుగు రోజుల క్రితం ఆయాసం రావడం, ముఖం వాచడంతో నాటువైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు సిధ్ధ, ఈశ్వరరావు శుక్రవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రాగోలు ఆస్పత్రికి రిఫర్‌ చేయగా తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సుస్మిత మృతి చెందింది. సుస్మిత గుండెలో రక్తం గడ్డ కట్టడంతో మృతి చెందిందని రాగోలు ఆస్పత్రి వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు.

విచారణకు కలెక్టర్‌, వైద్యాధికారి ఆదేశం

పార్వతీపురం రూరల్‌ : నాటు మందు వికటించి పత్తిక సుస్మిత (13) అనే బాలిక మృతి చెందిన ఘటనపై పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు శనివారం రాత్రి సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యురాలైన సంబంధిత ఏఎన్‌ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. సదరు బాలికకు కొందరు వ్యక్తులు ఇచ్చిన నాటు మందు వల్ల శ్వాస ఇబ్బంది, ముఖం, కాళ్ల వాపులు తలెత్తాయి. కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఒడిశాలోని మెట్టవాడ, ఆంధ్రప్రదేశ్‌లోని బొడ్లగూడ ప్రాంతాల్లో ఆ బాలికకు నాటు మందు అందించిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని రేగిడి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు సమర్పించి బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు, మందుల వివరాలు సేకరించాలని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ఇటువంటి గుర్తింపు లేని నాటు మందులను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని కలెక్టర్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement