రాజాం: రాజాం పట్టణంతో పాటు చుట్టుపక్కల స్క్రాబ్ వ్యాపారాలు అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా ఈ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేయడంతో చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దగ్గర్లోని సచివాలయాలు, అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యాపారాలు మరింత భయానక వాతావరణంలో జరుగుతున్నాయి. నిషేధిత వ్యర్థాలతో కూడిన వస్తువులు కొనుగోలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
తరచుగా ప్రమాదాలు
ఇటీవల రాజాంలో స్క్రాబ్ వ్యాపారాల వద్ద తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట మండలంలోని వీఆర్ అగ్రహారంలో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకర కెమికల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. అంతకుముందు రాజాం పట్టణంలో ఓ షాపు వద్ద కూడా ఇలానే అగ్నిప్రమాదం జరిగింది. దగ్గర్లో నీటి సదుపాయం ఉండడంతో మంటలను అదుపుచేశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు.
నిబంధనలు బేఖాతరు
ఇటీవల ఫైర్ శాఖాధికారులు రాజాంలో స్క్రాబ్ షాపులను తనిఖీ చేశారు. రాజాం పట్టణంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో 30కి పైగా షాపులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ వ్యాపారాలకు జీఎస్‌టీ గుర్తింపు, కార్మికశాఖ, మున్సిపల్, సచివాలయాల అనుమతులు ఉండాలి. కాని అవేమీ లేవు.అలాగే ఇనుము, ప్లాస్టిక్ వస్తువుల కొనుగోలుకే వేర్వేరుగా అనుమతులిస్తారు. కెమికల్స్ వస్తువులు అస్సలు కొనుగోలు చేయరదు. జనావాసాలకు దూరంగా స్క్రాబ్ వస్తువులు నిల్వ చేయాలి. కాని ఏ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడం లేదు.
ఫిర్యాదులున్నా పట్టించుకోరే..
రాజాం మండలం పెనుబాక గ్రామ పరిధి కొత్తవలస రోడ్డులో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద ప్రమాదకర రీతిలో ప్లాస్టిక్ నిల్వలున్నాయి. వీటిని అడ్డుకోవాలని, ఇక్కడ రాత్రి సమయాల్లో భారీగా అక్రమ సరుకు రవాణా అవుతోందని అటు మున్సిపల్, ఇటు పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకూ స్పందించలేదు. జీఎస్‌టీ లేకుండా వేరే ఫార్మా కంపెనీల పేర్లతో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వీఆర్ అగ్రహారం స్క్రాబ్ షాపులో ప్రమాదం అనంతరం పొగిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న షాపుపై గ్రామ సచివాలయంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
చర్యలు తీసుకుంటాం..
రాజాంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో స్క్రాబ్ షాపుల్లో తనిఖీలు చేశాం. నిబంధనలు పాటించని వారికి అవగాహన కల్పించాం. కొన్నిచోట్ల ప్రమాదకర ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్ సామాగ్రి నిల్వలు అధికంగా ఉన్నాయి. వీటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు.
పి.అశోక్, ఫైర్ అండ్ సేప్టీ అధికారి, రాజాం.


