విజయనగరం గంటస్తంభం: నెల్లూరు జిల్లా దువ్వురు – సంగం మండలాల ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులుప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జరిగిన మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ పోటీల్లో కళాశాలకు చెందిన బి.నీలిమ ( ఫైనల్ బీఏ) అత్యుత్తమ ఆటతీరుతో చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో శనివారం జరిగిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి గోపాలరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు.
నమ్మించి మోసం చేశారు..
శృంగవరపుకోట: అమాయకులమైన తమను నమ్మించి, బెదిరించి, భూములు అమ్మించి పరిహారం తినేశారని మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు వాపోయారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుకు నిరసనగా ఉరి తాళ్లు బిగించికుంటూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిందాల్ భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులు తామరపల్లి రాము, గౌరమ్మ, సోమేష్, సిరగం బుదరయ్య, సన్యాసిదేముడు, ముత్యాలు, జె.గౌరీష్ మాట్లాడుతూ.. గిరిజనులకు చెందిన 27 ఎకరాల భూమిని అమ్మేసి, గుట్టు చప్పుడు కాకుండా పరిహారాన్ని తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. సొమ్ములు స్వాహా చేసిన బినామీలు ముదునూరు సత్యనారాయణవర్మ, ముదునూరు వరలక్ష్మి, వెంపటాపు అప్పలనాయడు, చల్లా రాములపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే గిరిజన సంఘాల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మొద్దు
డెంకాడ: సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. మండలంలోని పినతాడివాడలో ఉపాధి హామీ పథకం పనులు జరిగిన చోటుకు శనివారం వెళ్లి, సైబర్ నేరాలు–వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిరక్షరాస్యులు, అక్షరాస్యులనే తేడా లేకుండా ప్రతిఒక్కరికీ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలు అడిగే అవకాశం ఉందని, పొరపాటున కూడా ఆ వివరాలు ఇవ్వొద్దన్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దన్నారు. అలాగే మహిళల భద్రతకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, బాల్యవివాహాలు చేయవద్దని, మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించవద్దని కోరారు.
నందిగుడ్డి కాలనీవాసులతో...
విజయనగరం క్రైమ్: స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందిగుడ్డి కాలనీవాసులతో సీఐ శ్రీనివాస్ శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కాలనీ నుంచే పలు నేరాలకు సంబంధించిన నిందితులు వచ్చినట్లు తమ విచారణలో తేలిందని, పౌరులంతా మంచి అలవాట్లు అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు.


