పార్వతీపురం రూరల్: పట్టణాల సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ’సాసా’, ’స్వచ్ఛ భారత్ – స్వర్ణ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, పర్యావరణ అవగాహన ర్యాలీల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక మున్సిపల్ పార్కును సందర్శించిన కలెక్టర్.. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాత, పనికిరాని టైర్లతో సృజనాత్మకంగా రూపొందించిన ఆట పరికరాలను పరిశీలించారు. వ్యర్థాలను పర్యావరణహితంగా, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడంపై అధికారులను అభినందించారు. పార్కును నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల భద్రతకు ఎక్కడా లోటు లేకుండా ఆట స్థలాలను పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ప్రదర్శనలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కొద్ది దూరానికి కూడా వాహనాలు వినియోగించవద్దని సూచించారు. ఒకే ప్రాంతానికి వెళ్లేవారు ’కార్ పూలింగ్’ విధానాన్ని అవలంభించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపాలని, ఇందుకు అనుగుణంగా పట్టణంలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాల అనవసర వినియోగాన్ని తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత నగరమే ధ్యేయంగా శివాలయం వీధి చెరువు పరిసరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సైకిల్ ర్యాలీలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణలో (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానాన్ని అమలు చేయడమే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రజల సహకారం అవసరమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ ఆర్. వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రభాకరరెడ్డి


