సీతానగరం: మండలంలోని గుచ్చిమి పెట్రోల్‌బంక్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని జమదాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆయిల్ కొనుగోలు నిమిత్తం మోటార్‌సైకిల్‌పై గుచ్చిమి పెట్రోల్ బంక్‌కు వచ్చారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో రోడ్డు ఎక్కుతుండగా అదేసమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదంలో అల్లు రోహిత్(17) మృతి చెందగా జన్ని చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుడిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని ఏఎస్సై లక్ష్మణరావు పరిశీలించి క్షతగాత్రుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆనందపురం(విశాఖ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొయ్యపేట గ్రామానికి చెందిన రైతు కాగితాల రాంబాబు (49) మృతిచెందాడు. గ్రామంలో పూలు సాగు చేసే ఆయన, రోజూ పూలను ఆనందపురం మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగానే తెల్లవారుజామున 3 గంటలకు ఆయన ఓ ప్రైవేట్ వ్యాన్‌లో ఆనందపురం మార్కెట్‌కు బయలుదేరాడు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో ఉన్న రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య కాగితాల పాపాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ సీహెచ్.వాసు నాయుడు కేసు నమోదు చేయగా ఎస్సై దర్యాప్తు చేపట్టారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
విజయనగరం క్రైమ్: విజయనగరం జీఆర్పీ సిబ్బంది గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ, స్కృహ కోల్పోయినట్లు గుర్తించామని జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం నంబర్ నాలుగుపై దింపగా, ఆన్ డ్యూటీ రైల్వే డాక్టర్ పరీక్ష చేసి ఆ వ్యక్తి మృతి చెందాడని నిర్ధారించారన్నారు. మృతుడు సుమారు 5 అడుగుల పొడవు కలిగి, చామన ఛాయ రంగులో ఉన్నాడని మృతుని కుడివైపు ఛాతీమీద, పొట్ట మీద పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మృతుడు నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742, 9440170317 నంబర్‌లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ కోరారు.


