పార్వతీపురం రూరల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో చిన్నచూపు తగదంటూ ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘా ల నాయకులు, రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఖండాపు ప్రసాద్, బంటుదాసు, ఎం.కృష్ణమూర్తి, రెడ్డి రమణమూర్తి తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతో పాటు తోటపల్లి నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. జంఝావతి, జంపరకోట, ఆడారుగెడ్డ, వనకాబడి గెడ్డ వంటి చిన్న తరహా ప్రాజెక్టులు కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒడిశా రాష్ట్రంతో ఉన్న సమస్యను పరిష్కరించి జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు కరణం రవీంద్ర, రెడ్డి వేణు, రంభ లక్ష్మణరావు, పి.రాము, తదితరులు పాల్గొన్నారు.


