మురిపించిన మారుజాతర
సిరిమాను కర్రకు పూజలు
● పోలమాంబ దర్శనానికి బారులు
మక్కువ: జై..పోలమాంబ..జైజై పోలమాంబ అంటూ భక్తులు చేసిన నినాదాలతో శంబర పులకించింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంచి వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకోగా దారులన్నీ రద్దీగా మారాయి. చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని, వనంగుడిలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వెనుకున ఉన్న వేపచెట్టు వద్ద భక్తులు దీప,ధూప నైవేద్యాలు సమర్పించారు.
మొక్కుబడులు చెల్లించిన భక్తులు
చదురుగుడి, వనంగుడి, గోముఖి నది ఒడ్డున భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు, చీరలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. చిన్నారులు తలనీలాలు సమర్పించుకున్నారు. పలువురు భక్తులు చీపుళ్లతో రహదారులను శుభ్రపరుస్తూ మొక్కుబడులు చెల్లించుకోగా, మరికొంతమంది భక్తులు ఘటాలను అమ్మవారికి సమర్పించుకున్నారు.
ఎండలో అమ్మదర్శనానికి వేచి ఉన్న భక్తులు
పోలమాంబ అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు ఉదయం 10గంటల తరువాత ఒక్కసారిగా చేరుకోవడంతో, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆరుబయట ఎండలో భక్తులు వేచిచూశారు. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంతో, భక్తులు అత్యధికంగా రూ.100 దర్శనం టిక్కెట్ క్యూ వద్దకు చేరుకోవడంతో, స్వల్ప తోపులాటల మధ్య భక్తులు అమ్మదర్శనానికి చేరుకున్నారు. సాలూరు సీఐ రామకృష్ణ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను దర్శనానికి పంపించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అమ్మవారి దర్శనానికి రావడంతో, సుమారు అరగంటపాటు భక్తులు ఇబ్బందులు పడ్డారు.
గ్రామంలోని ప్రధానరహదారి వద్దనున్న సిరిమాను కర్రకు భక్తులు పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా మురపాక గ్రామానికి చెందిన భజనబృందం సభ్యులు చదురుగుడి క్యూ వద్ద భజనకీర్తనలు ఆలపించారు. అమ్మ సేవకులు క్యూల వద్ద భక్తులుకు మంచినీటిని సరఫరా చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు పాలు, ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. జాతరకొచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐ రామకృష్ణ, ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నైధాన చినతిరుపతి, కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.
మురిపించిన మారుజాతర
మురిపించిన మారుజాతర
మురిపించిన మారుజాతర


