భారీగా బంగారం చోరీ
రాజాం: రాజాంలోని జీఎంఆర్‌ఐటీ క్వార్టర్స్‌లో ఆదివారం రాత్రి భారీగా బంగారం చోరీ జరిగింది. ప్రొఫెషనల్ దొంగలు ఈ చోరీకి పాల్పడి రెండిళ్లలోని బంగారం, వెండి పట్టుకుపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడడంతో ఈ దొంగతనం ప్రొఫెషనల్ దొంగల ముఠాదిగా పోలీసులు భావిస్తున్నారు. ఒకచోట 1250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారంతో పాటు కిలో వెండిని అపహరించుకుపోయారు. ఈ చోరీలపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇంట్లో..
రాజాం జీఎంఆర్‌కేర్ ఆస్పత్రిలో చిల్ట్రన్ స్పెషలిస్ట్‌గా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ వీడీ నగేష్ జీఎంఆర్‌ఐటీ కాలేజీలోని రస బ్లాక్‌లోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నం వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరుస్తుండగా అప్పటికే తలుపు తెరిచి ఉండడంతో అనుమానంతో వెంటనే బెడ్‌రూమ్‌లోని బీరువాను చూడగా, బీరువా తెరిచి ఉండడంతో పాటు పలురకాల వస్తుసామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడంతో ఇంట్లో దొంగలుపడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, సంతకవిటి ఎస్సై గోపాలరావులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. తన బీరువాలో భద్రపరిచిన 1250 గ్రాముల బంగారం(106 తులాలు)తో పాటు కిలో వెండి దొంగతనానికి గురైనట్లు డాక్టర్ వీడీ నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం నుంచి డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫింగర్ ఫ్రింట్ సీఐ మురళీమోన్, క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ నమోదుచేయడంతో పాటు క్వార్టర్స్‌లో పనిచేస్తున్న సిబ్బందిని, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. డాక్టర్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆ ఇంట్లో రూ. 2 కోట్లు విలువచేసే 1250 గ్రాముల బంగారంతో పాటు రూ. 50 లక్షలు విలువచేసే కిలో వెండి పోయినట్లు గుర్తించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతలో మరో చోరీ ఫిర్యాదు..
డాక్టర్ నగేష్ ఇంటి వద్ద దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించకముందే పక్కనే ఉన్న లయ బ్లాక్‌లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదువచ్చింది. ఆ బ్లాక్‌లో నివాసముంటున్న జీఎంఆర్‌ఐటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.మాధవకృష్ణారెడ్డి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆదివారం పాలకొండ వెళ్లానని, పక్క బ్లాక్‌లో దొంగతనం జరిగిందని తెలిసి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించానని వెల్లడించారు. తన బీరువాలో భద్రపరిచిన 291 గ్రాముల బంగారాన్ని(25 తులాలు) దొంగలు పట్టుకుపోయినట్లు బాధితుడు ఫిర్యాదుచేశాడు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్‌పీ
ఈ విషయం ఎస్‌పీ ఏఆర్ దామోదర్‌కు తెలియడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ప్రొఫెసర్ ఇంటి బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ కెమెరాల్లో ముగ్గురు దొంగలు చోరీకి వచ్చినట్లు గుర్తించారు. ఈ బ్లాక్‌ల పక్కనే ఉన్న ప్రహరీ నుంచి వారు లోపలకు చొరబడి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ప్రొఫెషనల్స్‌గా అనుమానిస్తున్నాం..
ఈ సందర్భంగా ఎస్‌పీ ఏఆర్ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ జీఎంఆర్‌ఐటీ క్వార్టర్స్‌లో జరిగిన చోరీకి సంబంధించి దొంగలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారన్నారు. చేతులకు గ్లౌజులు పెట్టి చోరీకి పాల్పడ్డారని, ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పాటించారని వెల్లడించారు. గతంలో దొంగతనాలకు పాల్పడి తెలివిగా తప్పించుకునే దొంగలముఠాకు చెందినవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారన్నారు. వారు ఎక్కడ ఉన్నా పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
జీఎంఆర్‌ఐటీ క్వార్టర్స్‌లోని
రెండిళ్లలో బంగారం అపహరణ
ఒకచోట 1,250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారం, కిలో వెండి కూడా మాయం
సీసీఫుటేజీల్లో దొంగల జాడ
రూ.3 కోట్ల మేర నష్టం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్
భారీగా బంగారం చోరీ
భారీగా బంగారం చోరీ


