ఘనంగా శ్రీ చక్రతీర్థ స్నానం
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీపద్మావతి, భూదేవి సహిత స్వామివారికి శ్రీచక్రతీర్థస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం సుప్రభాతసేవ, మంగళాశాసనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కలశారాధన, చూర్ణోక్రతం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి నాగావళి నదీ తీరం వరకు స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరువీధి నిర్వహించారు. పిమ్మట నాగావళినదీ తీరంలో చూర్ణంతో అమ్మవారికి, స్వామివారికి సంప్రోక్షణ తదితర పూజలను నిర్వహించారు. అలాగే పవిత్ర నాగావళినదిలో స్వామివారికి భక్తులు పంచామృతాభిషేకం, గంధాభిషేకం, సుగంధద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేషపూజలు చేసిన అనంతరం భక్తులు నాగావళినదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు వీవీ అప్పలాచార్యులు మాట్లాడుతూ లోక శాంతికోసం నదుల్లో, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలన్నారు. స్వామివారికి కల్యాణం, అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు నదుల్లో స్నానమాచరిస్తే వెయ్యి నదుల్లో స్నానం చేసిన పుణ్యం సిద్ధిస్తుందన్నారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, టీటీడీఎస్ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ చక్రతీర్థ స్నానం
ఘనంగా శ్రీ చక్రతీర్థ స్నానం


