ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పార్వతీపురం: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం డైరీని, ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించిన లిటరేచర్ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ సాగు, ప్రయోజనాలు, పెరటి తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయంకోసం తొమ్మిది సార్వత్రిక సూత్రాల పుస్తకాన్ని, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రహిత పద్ధతుల్లో పంటలను సాగు చేసే ప్రకృతి వ్యవసాయంవల్ల రైతుల ఆర్థికాభివృద్ధికి, ప్రజల ఆరోగ్య రక్షణకు, పర్యావరణ సమతుల్యతకు దోహదపడు తుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల నేల ఉత్పత్తి శక్తి తగ్గిపోతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడానికి జీవామృతం, బీజామృతంవంటి సహజ పద్ధతులు అనుసరించడం అవసరమని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్‌వీ.మాధవ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, సంఘం ప్రెసిడెంట్ కె.రత్న కుమారితోపాటు సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి


