
అందమే ఆనందం..!
విజయనగరం టౌన్: పెళ్లికుమార్తె ముస్తాబు చేస్తున్న బ్యూటీషియన్
విజయనగరం టౌన్:
ఫేషియల్ చేస్తున్న
దృశ్యం
● సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తున్న మహిళలు
● కాలానికి అనుగుణంగా మారుతున్న
మహిళల తీరు
● ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్న సంస్థలు
● స్వయం ఉపాధికి మార్గం అంటున్న శిక్షకులు
● నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవం
రాజాం సిటీ:/విజయనగరం టౌన్: అందానికి ఎవరు ఎన్ని అలంకారాలు ఇచ్చినా, ఉపమానాలు చూపినా అందమే ఆనందం అంటున్నారు మహిళలు. ఆ అందం వెనుక మరో మహిళ ఉండి ఆ అందానికే వన్నెతెస్తోంది. ఇంట్లో, వీధిలో, బంధువుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు శ్రద్ధ తీసుకుంటున్నారు. కిట్టీ పార్టీల నుంచి పెళ్లిళ్ల వరకు ఏ శుభకార్యకమైనా అతివలదే సందడి. వేడుక ఏదైనా మేకప్ అదరాల్సిందే. వారి ఆశలకు అనుగుణంగానే పట్టణాల్లో బ్యూటీ పార్లర్లు కూడా విస్తరిస్తున్నాయి. అవుట్ డోర్ షూట్‌లు, పుట్టినరోజు, నిశ్చితార్థం ఇలా వేడుక ఏదైనా వనితకు ప్రత్యేకమే. ప్రతి శుభకార్యానికి ముందస్తు వేడుక ఇప్పుడో ట్రెండ్‌గా మారిపోయింది. అప్పటికప్పుడు పార్టీలకు వెళ్లేందుకు సైతం అభిరుచికి తగ్గట్టు మగువల అందానికి బ్యూటీషియన్లు మరింత వన్నె తెస్తున్నారు.
నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవం
మహిళలు, విద్యార్థినులు సైతం అందానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాశ్చాత్య ధోరణి ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీపార్లర్లు కూడా మగువల అభిరుచులకు తగ్గట్లు నిర్వహణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కొద్దో గొప్పో బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వారికి ఓ ఆదాయ వనరుగా కూడా కలిసొస్తోంది. ఇంటివద్దే ఉంటూ నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పట్టణం నుంచి పల్లెల వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు మగువలు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్రెడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణ ఇలా ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు.
ఆదాయ వనరుగా..
బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరుగా బ్యూటీ పార్లర్లు కలిసివస్తున్నాయి. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెలకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తిని, అభిరుచిని గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. సింగిల్ ప్యాకేజీ, హోమ్ సర్వీసెస్ ద్వారా మగువలు వారి అందాన్ని మరింత మెరుగు పరుచుకుంటున్నారు. శరీరతత్వం, మనిషిరంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్‌కు అనుగుణంగా రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు రేట్లు నిర్ణయించి ఆదాయం సంపాదిస్తున్నారు.
శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు..
మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు శిక్షణ సంస్థలు కూడా బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్నచిన్న చిట్కాలను, మెలకువలను సైతం నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు.

అందమే ఆనందం..!

అందమే ఆనందం..!

అందమే ఆనందం..!