ధరాఘాతం..!
ఆయిల్ పామ్ ధర బాగుంది కదా అని రైతులు సాగుపై ఆసక్తి చూపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే గతేడాది వరకు నిలకడగా సాగిన ఆయిల్‌పామ్ ధర ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. పదిరోజుల వ్యవధిలోనే ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ఆయిల్‌పామ్ ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
● ఒక్కసారిగా పడిపోయిన ఆయిల్‌పామ్ రేటు ● పదిరోజుల వ్యవధిలో టన్నుకు రూ.2వేలు తగ్గింపు ● ఆందోళనలో రైతులు ● జిల్లాలో 35వేల ఎకరాల్లో సాగు
●ధరలను స్థిరీకరించాలి
రెతులను ఆదుకునేందుకు ఆయిల్‌పామ్ ధరలను స్థిరీకరించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి.
–కెంగువ పోలినాయుడు, రైతు, కంబవలస,
కొమరాడ మండలం
●దిగుమతి సుంకం పెంచాలి
ఆయిల్ పామ్‌కు గతంలో 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 10 శాతానికి తగ్గిపోవడంతో పెట్టుబడి పెరిగి ఆయిల్‌పామ్ ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో టన్ను రూ.23వేలు ఉన్న ధర ప్రస్తుతం తగ్గిపోయింది. దిగుమతి సుంకం పెంచితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆయిల్‌పామ్ ధరలను పెంచి రైతులను ఆదుకోవాలి.
–అంబటి గౌరునాయుడు,
రైతు, సంతోషపురం, గరుగుబిల్లి మండలం
పార్వతీపురం:
ఆయిల్ పామ్ ధరలు రోజురోజుకు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరకు నిలకడగా సాగిన ధరలు ప్రస్తుతం తిరోగమన బాట పట్టాయి. పదిరోజుల వ్యవధిలో నే టన్నుకు రూ.2వేల మేర ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల క్రితం వరకు రూ.20,290లున్న టన్ను ధర నేడు రూ.18,650కి పడిపోయింది. అంతర్జాతీయ పరి ణామాలు, ముడిచమురు ధరల ఆధారంగా ఆయిల్‌పామ్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుంటా యి. అంతర్జాతీయంగా ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం ధరలపై పడడంతో చివరిగా రైతులు నష్టపోతున్నారు. గత ఏడా ది వరకు ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకం 27.50 శాతం ఉండడంతో దేశీయ సాగు విక్రయాలపైనే శతశాతం ఆధారపడి డిమాండ్ బట్టి దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 27.50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 17.50 శాతానికి తగ్గించారు. ఇదే అదునుగా భావించి మార్కెట్‌లో కంపెనీలు, వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించి కొనుగోలుకు తెరతీశారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పార్వతీపురం, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, పాలకొండ, సాలూరు, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయిల్‌పామ్ సాగును రైతులు ఆశాజనకంగా చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూనే వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు 20వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగు ప్రస్తుతం 35వేల ఎకరాల వరకు చేరింది. ఆయిల్‌పామ్ ధరలు తగ్గడం కారణంగా అనుబంధ ఉత్పత్తులు కూడా ధరలు తగ్గితే రైతులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ధరాఘాతం..!
ధరాఘాతం..!


