జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ క్రీడాకారులు అర్హత సాధించినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడ్డి సతీష్ కుమార్ సాహు, తాళ్లపూడి గౌతమిలు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అర్హత సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 18 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వీరు బయలుదేరి వెళ్లనున్నారన్నారు. ఇదే స్ఫూర్తి తో జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. వారిద్దరి ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావులు అభినందనలు తెలిపారు.


