అటవీశాఖ, గిరిజనుల మధ్య వాగ్వాదం
సీతంపేట: అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య గురువారం అడ్డాకులగూడ గ్రామంలో వాగ్వాదం జరిగింది. సీతంపేట మండలంలోని కర్రగూడ, పాలమానుగూడ, అడ్డాకులగూడ, కారిమానుగూడ పరిధిలో వీఎస్‌ఎస్ భూముల్లో నగరవనం నిర్మాణానికి అటవీశాఖ తవ్వకాలు జరుపుతుండగా పలు గ్రామాల గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాలకొండ అటవీశాఖ రేంజర్ రామారావుతో పాటు సిబ్బంది మాట్లాడుతూ పనులు జరుగుతాయని, అటవీశాఖకు సంబంధించిన భూములు కాబట్టి ఇక్కడ నగరవనం నిర్మిస్తామని పట్టుబట్టారు. ఈ క్రమంలో తీవ్రవాగ్వాదం నెలకొంది. 25 ఎకరాల్లో వనసంరక్షణ సమితులు, అటవీశాఖ జాయింట్ పట్టాలు ఉన్నాయని సర్పంచ్ ఎస్.సిమ్మయ్య, గిరిజన నాయకులు ఎ.భాస్కరరావు, ఎం.లక్ష్మణరావులు తెలిపారు. గతంలో నీలగిరి మొక్కలు వేసినప్పటికీ ఒక్కపైసా కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఇక్కడ నగరవనం నిర్మిస్తే గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ భూములు గిరిజనులకే దక్కాలని, ఈ విషయమై ఐటీడీఏ పీఓకు కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు గిరిజనులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌వో రామారావు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం నుంచే నగరవనం ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాలు మంజూరు కావడంతో పాలకొండ నియోజకవర్గానికి ఇక్కడ మంజూరైందన్నారు. గిరిజనులకు ఎటవంటి నష్టం ఉండదన్నారు.


