పోలింగ్‌ కేంద్రాల మార్పు రద్దు చేయండి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల మార్పు రద్దు చేయండి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

పోలింగ్‌ కేంద్రాల మార్పు రద్దు చేయండి

లేకుంటే హైకోర్టును ఆశ్రయించి న్యాయం కోరతాం కలెక్టర్‌కు స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు కుట్రకు తెరలేపారని ఆగ్రహం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చేస్తున్నారని మండిపాటు

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత 40 ఏళ్ల నుంచి ఉన్న పోలింగ్‌ కేంద్రాలను మార్చి వెన్నుపోటు పార్టీ నాయకులు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ నరసరావుపేట, వినుకొండ మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో కూటమి పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు చేసిన పోలింగ్‌ కేంద్రాల మార్పులపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కలిశారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు దూరంగా, ఓసీ ఓటర్లు ఉన్న ప్రదేశాల్లోకి మార్చిన పోలింగ్‌ కేంద్రాలను మళ్లీ యథావిధిగా పునరుద్ధరించాలని వినతిపత్రం సమర్పించారు. అఖిల పక్ష సమావేశం పెట్టకుండా ఏకపక్షంగా ఎందుకు పోలింగ్‌ కేంద్రాలను మార్చారని అక్కడే ఉన్న డీపీఓ నాగేశ్వరనాయక్‌ను ప్రశ్నించారు. తక్షణమే మార్పులు చేయకపోతే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

అంతా అడ్డగోలుగానే...

ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం గ్రామంలో ఎస్‌సీలు నివాసం ఉండే ప్రాంతం నుంచి ఓసీలు ఉండే ప్రాంతానికి పోలింగ్‌ కేంద్రం మార్చారన్నారు. ఈ నెల 23వ తేదీన రొంపిచర్ల మండలంలో పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి డ్రాఫ్ట్‌ లిస్టును ఎంపీడీఓ సంతకంతో పబ్లిష్‌ చేశారని తెలిపారు. ఈ నెల 28న ఐదు రోజుల్లోపు ఈ డ్రాఫ్ట్‌ లిస్టును టీడీపీకి అనుకూలంగా మార్చారన్నారు. మొదటి డ్రాఫ్ట్‌ లిస్ట్‌ పబ్లిష్‌ చేసిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆల్‌ పార్టీ మీటింగ్‌ పెట్టాలని, కానీ అటువంటిదేమీ లేకుండా మార్పులు చేశారన్నారు. ఇష్టానుసారంగా ఇలా వ్యవహరించడం తగదని ఆయన హితవు పలికారు.

● రొంపిచర్ల గ్రామానికి సంబంధించి మార్చిన పడమటిపాలెం పోలింగ్‌ కేంద్రంలో గతంలో బాంబు బ్లాస్టింగ్‌ జరిగి కేసులు నమోదైన ఘటనలు ఉన్న దృష్ట్యా ఆ పోలింగ్‌ కేంద్రంలోకి మార్చకూడదని హైకోర్టు జడ్జిమెంట్‌ కూడా ఉందన్నారు. అయినా టీడీపీ నాయకుల సూచనలతో పోలింగ్‌ కేంద్రాన్ని మార్చారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిజంగా టీడీపీ నాయకులకు గెలిచే సత్తా ఉంటే 40 ఏళ్ల నుంచి ఓటింగ్‌ జరుగుతున్న పోలింగ్‌ కేంద్రాలను ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మొన్న డీపీఓను కలిశామని, ఇప్పుడు కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement