జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పరికరాల పంపిణీ
నరసరావుపేట ఈస్ట్: ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు నాణ్యమైన విద్య, వైద్యం, సంరక్షణ అందించటం ద్వారా వారి జీవితాలలో సానుకూల మార్పు తీసుకవచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈమేరకు సమగ్ర శిక్ష ద్వారా సహిత విద్యను ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నామన్నారు. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 407 మంది బాలబాలికలకు రూ.34.19 లక్షలు విలువైన వివిధ పరికరాలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల యుడైస్ గణాంకాల మేరకు పల్నాడు జిల్లాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు 3,363 మంది ఉన్నారన్నారు. వీరిలో 540 మంది భవిత విద్యా కేంద్రాలకు హాజరవుతుండగా మిగిలిన వారు ఇంటి వద్దనే తల్లిదండ్రులతో ఉంటూ విద్యనభ్యసిస్తూన్నారని తెలిపారు. వైకల్యం, వైవిధ్యం ఉన్న దివ్యాంగ విద్యార్థుల కోసం జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రతి నెల 4వ శనివారం దివ్యాంగుల కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి పివిజే రామారావు, సమగ్ర శిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.


