శుభకార్యంలో నగలు, నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

శుభకార్యంలో నగలు, నగదు చోరీ

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

పారిపోతుండగా రోడ్డు

ప్రమాదానికి గురైన నిందితుడు

గాయపడటంతో బయటపడిన

అసలు విషయం

వినుకొండ: ఓ యువకుడు బుధవారం రాత్రి త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తన చేతివాటం ప్రదర్శించాడు. రూ. 4 లక్షల నగదు, బంగారంతో స్కూటీపై పరారయ్యాడు. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అసలు విషయం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. అతని ముఖానికి, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ దారిన వెళ్లే వారు వెంటనే 108 కి సమాచారం అందించారు. సిబ్బంది మహబూబ్‌ బాషా, నరేష్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు.

ఇలా తెలిసింది...

తన పేరు యెహోషువా అని, తమది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి స్థిరపడ్డామని 108 సిబ్బందికి క్షతగాత్రుడు సమాచారం ఇచ్చాడు. తాను బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లొస్తున్నట్లు తెలిపాడు. కాటంవారి పల్లె గ్రామ చరిత్రలో ఆ పేరుగల కుటుంబం లేదని స్థానికులు తెలిపారు. అయితే క్షతగాత్రుడు కావాలని తమ వివరాలు చెప్పకుండా దాటవేసినట్లు 108 సిబ్బందికి అర్థమైంది. క్షతగాత్రుడి వద్ద ఫోనులో నంబరు తీసి అతని భార్యకు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకుని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండం వాటిని తెచ్చాడని భార్య తెలిపింది. త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయటంతో ఫోన్‌ నంబరు సిగ్నల్‌ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది వెంటనే ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలను పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement