యువకుడి హత్యకు యత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడి హత్యకు యత్నం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్యకు పథకం

మారణాయుథాలతో ఇంటి పైకి వచ్చిన దుండగులు

స్థానికులు అప్రమత్తతతో బెడిసిన హత్యాయత్నం

ఇరువురు నిందితులు పరారీ

మరో ఇరువురిని దేహశుద్ధి చేసి విద్యుత్‌ స్తంభానికి కట్టేసిన స్థానికులు

సత్తెనపల్లి: హత్యాయత్నానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి చేసిన సంఘటన పట్టణంలోని వడ్డవల్లి చెక్క వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వడవల్లి చెక్కవంతెన ఏరియాకు చెందిన నల్లబోతుల నాగరాజు, భార్య భవానీ హోటళ్లలో కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా భవానీ ఆరు నెలల నుంచి పట్టణంలోని అచ్చంపేట రోడ్‌లో గల శివాలయం సమీపంలో నివాసముండే పమిడిగుంట్ల మహేష్‌ను రహస్యంగా కలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన భార్య భవానీని ప్రశ్నించడంతో మహేష్‌తో ఉన్న వివాహేతర సంబంధం అంగీకరించింది. నాగరాజు, తన కుటుంబ సభ్యులు చెప్పినా భవానీ ఖాతరు చేయకుండా మహేష్‌తో తిరుగుతుంది. నాగరాజు ప్రశ్నిస్తున్న విషయాన్ని మహేష్‌కు భవానీ చెప్పడంతో నెల రోజులుగా నాగరాజును చంపుతానంటూ మహేష్‌ ఇంటి పరిసరాల్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. భయపడిన నాగరాజు ఇంటికి రావడం మానేశాడు. కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఈనెల 13న సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ విషయాన్ని నాగరాజు భార్య భవానీ తన ప్రియుడైన మహేష్‌ కు ఫోన్‌ లో తెలియజేయగా మహేష్‌ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాగరాజును హతమార్చేందుకు కత్తి తీసుకొని రాగా గమనించిన ఇరుగు పొరుగువారు మహేష్‌ దాడి చేస్తాడన్న భయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను కత్తి చూపించి అందర్నీ బెదిరించాడు. నా తమ్ముడు, స్నేహితులతో మళ్ళీ వస్తానని, నాగరాజును కచ్చితంగా చంపుతానని, అడ్డొచ్చిన వారిని కూడా చంపుతానని మహేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 10:30 గంటల సమయంలో మహేష్‌ తమ్ముడైన ఆకాష్‌, అతని స్నేహితులైన మధార్‌వలి, షేక్‌ ఖాసిం సైదా అలియాస్‌ అండా ముగ్గురు మోటార్‌ సైకిల్‌ పై వచ్చారు. మహేష్‌ తమ్ముడు అయిన ఆకాష్‌ తను చేతిలో ఉన్న గొడ్డలితో ఇంటి సమీపముకు వచ్చి నాగరాజును హతమార్చేందుకు యత్నించగా నాగరాజు భయంతో పరుగులు పెట్టాడు. నాగరాజును వెంబడించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్థానికులు అడ్డు పడటంతో ఆకాష్‌ పెనుగులాడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరు మదార్‌వలి, ఖాసీం సైదా అలియాస్‌ అండా స్థానికులకు దొరకడంతో వారిరు వురికి దేహశుద్ధి చేసి విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీ, మహేష్‌ల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నాగరాజు అడ్డుస్తున్నాడనే ఉద్దేశంతో పథకం ప్రకారం నాగరాజును హతమార్చేందుకు యత్నించారు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు హత్యా నేరం క్రింద నల్లబోతుల భవానీ, పమిడి గుంట్ల మహేష్‌, పమిడిగుంట్ల ఆకాష్‌, మధార్‌వలి, ఖాసిం సైదా అలియాస్‌ అండా పై పట్టణ సీఐ ఎన్‌.నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement