టార్గెట్‌ గుంటూరు ! | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ గుంటూరు !

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

గుంటూరు డివిజన్‌ పరిధిలోనే తరచూ రైలు దోపిడీలు ఆలూరు వద్ద దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు 20 రోజుల్లో రెండోసారి దోపిడీకి యత్నం గత నెల 20న అప్పికట్ల వద్ద రైలు దోపిడీ సిబ్బంది లేక సతమతమవుతున్న జీఆర్పీ

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్‌ శాఖకు సవాల్‌గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్‌గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్‌ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్‌పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్‌ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది.

సిబ్బంది కొరతే పెనుసవాలు

రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్‌ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, ఐఆర్‌పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్‌కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్‌గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని జీఆర్‌పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్‌ గుంటూరు రైల్వే స్టేషన్‌ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్‌ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు.

అసలేం జరిగింది

రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్‌లతో సహా సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్‌ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్‌లు తుపాకులతో ఫుట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) మాత్రం విజయవాడ డివిజన్‌ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్‌ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్‌ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement