ఎన్నో ఆశలతో నీట్‌కు హాజరైన విద్యార్థులు పగలు, రాత్రి కష్టపడి సన్నద్ధం ఎన్‌టీఏ విడుదల చేసిన ‘కీ’లో అత్యధిక మార్కులు కై వసం జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు వస్తాయని కలలుకంటున్న తరుణం నీట్ పరీక్ష రద్దు వార్తతో తీవ్ర నిరాశ, నిస్పృహలో విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా అంటూ ఆగ్రహం గుంటూరు జిల్లాలో నీట్ రాసిన 8,299 మంది విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్‌టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్‌కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్‌టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు.
నిరాశ, నిస్పృహలో విద్యార్థులు
దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్‌కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


