ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: ఈ–కేవైసీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం డివిజినల్ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాలకు ఈ–కేవైసీ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులలో వెనుకబడి ఉన్న తప్పనిసరిగా ప్రగతి చూపించాలని, లేనిపక్షంలో చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.
ఇళ్ల గణన పరిశీలన..
జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజన సింహ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని రామిరెడ్డిపేటలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇళ్ల గణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కేసులు..
నరసరావుపేట: జిల్లాలో బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే బాల్యవివాహాలు చేసే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సకాలంలో అధికారులను అప్రమత్తం చేయటం ద్వారా వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహం, దాచేపల్లిలోని మరో వివాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన కోసం తీసుకోవలసిన చర్యలపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో గ్రామస్థాయి, కమ్యూనిటీ లెవెల్‌లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థినుల ఇళ్ల వద్ద నిఘా ఉంచాలని, గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


