సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్‌పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌్‌లో మంగళవారం మరో అక్రమ కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ నాగార్జునయాదవ్ గతంలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2024 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 244 రోజులపాటు ఈ నిధులు స్థానిక సంస్థలకు అందలేదని ఆయన గణంకాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు అసత్యమని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని జనసేన నేత రామ సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇదే అంశంపై నాగార్జునయాదవ్‌పై కొద్దిరోజుల కిందట కాకినాడ జిల్లాలో కూడా కేసు నమోదు చేశారు.


