ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు వడదెబ్బకు వృద్ధురాలు మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మత్స్యకారుడు మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వైద్యరంగంలో నర్సుల పాత్ర కీలకం

యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

మోహనరావు

నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్‌: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రెమిడీయల్‌ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్‌ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్‌లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్‌ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్‌ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

నరసరావుపేట రూరల్‌: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని రావిపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని కాసు వెంగళరెడ్డి కాలనీకి చెందిన కాలే పాపమ్మ(75) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. రెండు రోజుల కిందట వరకు మిరప కూలి పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతిచెందింది.

రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామం వద్దగల కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విప్పర్ల గ్రామానికి చెందిన కోరా వెంకటేశ్వర్లు(30) మృతి చెందాడు. కోరా వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై రెడ్డిపాలెం గ్రామం నుంచి తన స్వగ్రామమైన విప్పర్ల గ్రామానికి వస్తూ ఎక్స్‌ప్రెస్‌వేని దాటుతుండగా నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ ప్రాంతంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. విజయపురి సౌత్‌లోని డౌన్‌ మార్కెట్‌కు చెందిన మైలపల్లి గోవింద్‌ (42) శ్రీశైలానికి వెళ్లే మార్గంలో జోడుతొట్లు వద్ద ఉంటున్నాడు. సోమవారం పిల్లలతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు సాగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో జెండాపెంట వద్ద గోవింద్‌ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రా నాగార్జున బాబు (24) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నాగార్జున బాబు భార్య పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన నాగార్జున సంతోషంతో తిరిగి వెళ్తూ మద్యం తాగాడు. అనంతరం వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నాగార్జున మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్‌లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.ఎస్‌.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్‌ఓ యశ్వంత్‌, జాషువా, ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement