ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటు

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటు

నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్‌సీ, ఎస్‌టీలకు చెందిన గృహాలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్‌ లెవెల్‌ సోలరైజేషన్‌, ఎస్‌సీ, ఎస్‌టీల సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు, పీఎం సూర్యఘర్‌ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్‌ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్‌లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్‌కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్‌ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

సాగు కనెక్షన్లపై దృష్టి

రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్‌ కోసం 12 సబ్‌స్టేషన్లలో సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీల్లో విద్యుత్‌ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌, కాలనీల నుంచి విద్యుత్‌ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్‌ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్‌ సాధించామని, ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్‌ డైరక్టర్‌ మురళీకృష్ణ యాదవ్‌, ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ టీవీఎస్‌ఎన్‌ మూర్తి, ఫైనాన్స్‌ డైరక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ పి.విజయకుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

1.91 లక్షల ఎస్‌సీ, ఎస్‌టీల గృహాలపై బిగించేందుకు చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement