చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన | - | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్‌ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు

● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్‌ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు

చిలకలూరిపేటటౌన్‌/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్‌ పట్టే ప్రసక్తే లేదని కాల్‌ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్‌ మేనేజర్‌ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్‌ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్‌ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్‌కాల్‌ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్‌కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్‌ఎం ఫోన్‌ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్‌ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్‌కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్‌డ్రైవర్లతో ఫోన్‌ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement