అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చాగంటివారిపాలెం (ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన జరిగింది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్‌ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన షేక్‌ సైదాబీ (39) చాగంటివారిపాలెంకు చెందిన రుద్రపాటి చంద్రశేఖర్‌ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్నా సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్‌, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్‌ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెంది ఉంది. చంద్రశేఖర్‌కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... చంద్రశేఖర్‌తో సైదాబీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే చాగంటివారిపాలెం గ్రామానికి తరచూ వస్తుండేదని స్థానికులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చంద్రశేఖర్‌ను బిర్యానీ కోసం బయటకు పంపించి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైదాబీ మృతిని తట్టుకోలేక ఎక్కువ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడైంది. సైదాబీకి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement