క్షణికావేశంతోనే.. | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంతోనే..

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

క్షణికావేశంతోనే..

సాక్షి, నరసరావుపేట: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కార్ల్‌ మార్క్స్‌. ప్రస్తుత సమాజంలో అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే విలువనిస్తున్నారు. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబంధులుగా మారుతున్నారు. అంతవరకు తమలో ఒకరిగా ఉన్న వ్యక్తులు అంతలోనే శత్రువులుగా మారుతున్నారు. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువవుతోంది. ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ముల్లే యమకింకరులవుతున్నారు. ఆస్తి కోసమో... క్షణాకావేశమో కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల చిలకలకూరిపేటలో కన్న తల్లిదండ్రులనే చంపాలని కూతురు చేసిన హత్యాయత్నం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ మొదలైంది.

తల్లిదండ్రుల ఇంటికి పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

కనిపెంచిన తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి వస్తుందన్న కారణంతో కూతురు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టిన ఘటన గత నెల 29వ తేదీన చిలకలకూరిపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడిలో నివాసం ఉంటున్న గౌడిశెట్టి సుకన్య, మల్లికార్జునరావులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు వివాహమై ఓ కూతురు పుట్టిన తరువాత భర్తతో విడాకులు తీసుకొని పట్టణంలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కొన్నాళ్లుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. గత నెల 29న తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి ఇంట్లో దాచిన బాణసంచా పేలడంతో పెద్ద శబ్దం రావడంతో తల్లిండ్రులకు మెలుకువచ్చి అదృష్టవశాత్తు మంటల నుంచి బయటపడ్డారు. తాము చనిపోతే ఆస్తి వస్తుందని కన్న కూతురు ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లి సుకన్య చిలకలూరిపేట టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు నివ్వెరపోయారు. ఆస్తి కోసం తల్లిదండ్రులనే చంపాలని కూతురు చూడడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలం కోసం తండ్రినే...

పొలం కోసం కన్నకొడుకే తనను గొంతునులిమి చంపబోతే ఊరి వదిలి పారిపోయానని తనకు రక్షణ కల్పించాలని ఓ తండ్రి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... దాచేపల్లికి చెందిన అచ్చాల కనకయ్య(70)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. అందరికీ పెళ్లికాగా చిన్న కుమారుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో వారితోనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకి పదేళ్ల క్రితమే ఆస్తి పంపకాలు చేసేసాడు. అయితే తన బతుకుతెరువు కోసం ఉంచుకున్న కొద్దిపాటి పొలం కోసం తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గత నెల ఇదే క్రమంలో తనను గొంతునులిమి చంపబోతే పొన్నూరు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నానని కనకయ్య ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ముందు గోడువెళ్లబోసుకున్నాడు. కుటుంబ సభ్యులు తన ఆచూకీ కనుగొని మళ్లీ దాచేపల్లికి తెచ్చారని, అయితే తనకు పెద్ద కొడుకు ద్వారా ప్రాణహాని ఉందని ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన అక్కడున్నవారిని కలచివేసింది.

ఆస్తి కోసమో, పంతం కోసమో సొంత కుటుంబ సభ్యులను సైతం హత్య, దాడులు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. క్షణాకావేశంతో తాము ఏమి చేస్తున్నాం అన్న స్పృహ లేకపోవడంతోనే ఈ హత్యలు చేస్తున్నారు. ఆర్థికపరమైన ఆంశాలు, పట్టింపులే బంధుత్వాలు దెబ్బతినడానికి కారణమని ఎక్కువమంది మా వద్దకు వస్తున్న వారి ద్వారా తెలిసింది. కొంతమందికి మానసిక రుగ్మతల వల్ల ఇలాంటి విపరీతపోకడలకు వెళుతున్నారు. వారిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం చేయిచాల్సి ఉంది. మారుతున్న కాలంతోపాటు కుటుంబ విలువలు తగ్గిపోవడం కూడా దీనికి కారణమవుతోంది.

–డాక్టర్‌ సతీష్‌ అత్తిలి,

మానసిక వైద్యుడు, నరసరావుపేట ఏరియా వైద్యశాల

Advertisement
 
Advertisement
Advertisement