బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

ఆందోళనకు దిగిన కార్మికులు డిపోలో నిలిచిపోయిన బస్సులు ప్రయాణికుల పరేషాన్‌

చిలకలూరిపేటటౌన్‌/

యడ్లపాడు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా చిలకలూరిపేట డిపో డ్రైవర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తున్న బస్సును చౌడవరం స్టాప్‌వద్ద ఆపకపోవడంతో స్థానికులు కొందరు ఆగ్రహించి డ్రైవర్‌ జి దుర్గాప్రసాద్‌పై భౌతిక దాడికి దిగడం ఈ ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలిసింది. తమ సహచర ఉద్యోగిపై జరిగిన దాడిని ఖండిస్తూ సుమారు 35 మంది అద్దె ప్రాతిపదికన పనిచేసే (కాల్‌) డ్రైవర్లు ఉదయం నుంచే విధులను బహిష్కరించి మరుసటిరోజు బస్టాండ్‌ ఆవరణలో ధర్నాకు దిగారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించే వరకు బస్సులు కదిలించేది లేదని భీష్మించుకోవడంతో డిపో కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. డిపో మేనేజర్‌ వై వేణు ఆందోళనకారులతో చర్చలు జరిపి సర్దిచెప్పే ప్రయత్నం ఫలించలేదు. కార్మికులు ససేమిరా అనడంతో పాటు సోమవారం తమ విధుల్ని పూర్తిగా బహిష్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

ప్రయాణికులకు ఇక్కట్లు...

డ్రైవర్ల ఆందోళన ప్రభావం సామాన్య ప్రయాణికులపై తీవ్రంగా పడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు గంటల తరబడి నిలిచిపోవడంతో బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర డ్రైవర్ల ద్వారా కొన్ని సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ, మరో 8 బస్సులు డ్రైవర్లు లేక డిపోకే పరిమితమయ్యాయి. బాధిత డ్రైవర్‌ ద్వారా ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ సిబ్బంది నిరసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భద్రతపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటం ఆపబోమని డ్రైవర్ల సంఘం స్పష్టం చేయడంతో డిపో పరిసరాల్లో ఆందోళన వాతావరణం కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement