టాస్క్‌ఫోర్స్(ముప్పాళ్ళ): తిరునాళ్లలో భాగంగా ఎస్సీ వర్గీయులు బాణాసంచా పేల్చటానికి వీలులేదంటూ టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి అత్తోట కృష్ణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడికి దిగిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గీయులు విద్యుత్‌ప్రభ పైన ఆర్కెష్ట్రా ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు జొన్నలగడ్డ ప్రసన్న, మాతంగి రత్నబాబు, మరికొందరు దీపావళి మందులు కాల్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి అత్తోట కృష్ణ, గరికపాటి సాంబశివరావు, గరికపాటి కరుణ, ఎర్రంనేడి రవితేజ తో పాటుగా మరికొంతమంది మీకు ఇక్కడేం పనిరా అంటూ... ఒక్కసారిగా దాడికి దిగారు. దాడితో పాటుగా విచక్షణారహితంగా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో దుర్బాషలాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబసభ్యులను సైతం బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు యువత తెలిపారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగటం గమనార్హం. దాడిలో ప్రసన్న, రత్నబాబులకు స్వల్ప గాయాలయ్యాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఇలాంటి దాడులు చేయడం ఏంటని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై బాధితులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


