చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.


