కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్‌ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్‌బీఐ బ్యాంక్‌లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలని, శాశ్వత ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


