అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

● పీజీఆర్‌ఎస్‌లో అదనపు ఎస్పీ సంతోష్‌ ● అర్జీలు స్వీకరించిన అధికారులు సమాఖ్య లీడర్‌ చేతివాటం నా స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు జీతం ఇవ్వకుండా మోసం ఏటీఎం సెంటర్‌లో టోకరా

నరసరావుపేట రూరల్‌: భూ వివాదాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) జేవి సంతోష్‌ పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలనిఅనదపు ఎస్పీ సూచించారు.

సమాఖ్య లీడర్‌ మల్లెల అనీల నాకు తెలియకుండా నాలుగు పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా చేర్చి బ్యాంక్‌ల నుంచి సుమారు రూ.10లక్షల వరకు రుణం తీసుకుని మోసం చేసింది. బ్యాంక్‌ నుంచి రుణం చెల్లించమని నోటీసులు రావడంతో విషయం తెలిసింది. దీనిపై అనీలను ప్రశ్నించగా బ్యాంక్‌కు డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పిందని, రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను చెల్లించనని బెదిరింపులకు పాల్పడుతుంది. ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన అనీలపై చర్యలు తీసుకోవాలి.

–కంచర్ల సుజాత, నరసరావుపేట

గ్రామంలో నాకు చెందిన 13 సెంట్లలో రెండు సెంట్లలో దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెలకు ఇచ్చాను. ఈ స్థలం నాదంటూ పాపిరెడ్డి అనే వ్యక్తి వచ్చి దుకాణాదారులను బెదిరించి అద్దె వసూలు చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేయగా స్థలాన్ని సర్వే చేసి నాదిగా నిర్దారించారు. అయినా పాపిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ దాడికి ప్రయత్నిస్తున్నాడు. నాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి.

–దిడిచినాల రామిరెడ్డి, శిరిగిరిపాడు

ఉద్యోగం కల్పిస్తానని మోసం చేశారు. గతేడాది డిసెంబర్‌ 11వ తేదీన రాజా హిందుస్తాన్‌ నిధి సంస్థలో సేల్స్‌ ఆఫీసర్‌గా నియమించారు. నెలకు రూ.45వేలు జీతం అని ప్రకటించి నాలుగు నెలలుగా పని చేయించుకుంటూ జీతం ఇవ్వడం లేదు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి.

–జంగాల కోటేశ్వరరావు, నరసరావుపేట

ఏటీఎం సెంటర్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతి తన అకౌంట్‌ నుంచి నగదు డ్రా చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన పెదనందిపాడు రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లాను. నాకు చదువు లేకపోవడంతో అక్కడే ఉన్న యువతిని డబ్బులు డ్రా చేసి పెట్టమని కోరాను. యువతి పలు నెంబర్లు కొట్టిన తరువాత కార్డు పనిచేయడం లేదని వెళ్లిపోయింది. దీనిపై బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా నా అకౌంట్‌ నుంచి రూ.26వేలు డ్రా చేసినట్టు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.

–షేక్‌ మీరా అహ్మద్‌, చిలకలూరిపేట

Advertisement
 
Advertisement
Advertisement