అక్రమ లే–అవుట్లు, నిర్మాణాలపై
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు, అక్రమ లే–అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్‌డీఓలు, డీపీఓ, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లే అవుట్లపై ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం–2016 ప్రకారం అనధికార లే–అవుట్లను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ ఐదు ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్, కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనకాడకూడదని స్పష్టం చేశారు. ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం, పటిష్టమైన పర్యవేక్షణ ద్వారానే అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేయగలమని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు కె.బాలకృష్ణ, శ్రీరాములు, మురళీకృష్ణ, డీఎల్‌డీఓలు వెంకటరెడ్డి, గబ్రూ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల గణన పూర్తిచేయని అధికారులపై చర్యలు
జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ హెచ్చరించారు. సోమవారం జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల ఒకటవ తేదీ నుంచి 30లోగా ఇళ్ల గణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇళ్ల గణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి నెలాఖరులోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహా


