నాదెండ్ల: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నాదెండ్ల–గణపవరం ఎన్‌ఎస్‌పీ కాలువ కట్ట మీద ముగ్గుతో గీతలు గీసి పసుపు కుంకుమ, అరటి నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్ధానికులు గుర్తించారు. సోమవారం ఉదయం స్థానిక రైతులు అటుగా వెళ్తూండగా, వింత ఆకృతిలో గీసిన ముగ్గు, పూజా సామాగ్రి చూసి ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు.
14న నాట్కో సెంటర్‌లో పెట్ స్కాన్ ప్రారంభం
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు.
23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్‌యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు.


