ఎస్టీయూ నాయకులు
నరసరావుపేట ఈస్ట్: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత కూడా వరుసగా వివిధ సమావేశాల పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించటం తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్‌టీయూ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును కలసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో ఆడ్మిషన్ డ్రైవ్‌ను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ, వేసవి సెలవుల మధ్యలో ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయంలో మండల స్థాయిలో పాఠశాల ప్లాన్, హ్యాబిటేషన్, క్లస్టర్ ప్లాన్, మండల ప్లాన్‌ను ఈనెల 13వ తేదీలోపు పూర్తి చేయాలని గడువు విధించటం సరికాదని తెలిపారు. ఈమేరకు సమగ్ర శిక్ష ప్లాన్ షెడ్యూల్ ప్రకటించటం అభ్యంతరకరమని తెలిపారు. అధికారుల తీరుతో విద్యా శాఖ వెకేషన్ డిపార్ట్‌మెంటా లేదా నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంటా అని ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నవంబర్ నెలలో స్కూల్ డెవలప్‌మెంట్, హ్యాబిటేషన్, క్లస్టర్, మండల ప్రణాళికలను పూర్తి చేయాల్సి ఉందనీ, వేసవి సెలవుల్లో షెడ్యూల్ విడుదల చేయటాన్ని ఎస్టీయూ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత మరోమారు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. డీఈఓ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళతానని తెలి పా రు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్.మహబూబ్ సుభానీ, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు షేక్.కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్ వై.రామయ్య, పి.వి.మల్లికార్జునరెడ్డి, రొంపిచర్ల మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


