లీజు కాలం ముగిసింది..
● ఈ ఏడాది మార్చితో ముగిసిన వైనం
● టీడీపీ నేతల అండతో వేలం నిర్వహణను అడ్డుకుంటున్న బల్లకట్టు మాఫియా
● రెండు నెలలుగా అక్రమంగా నిర్వహణ
● ప్రయాణికుల నుంచి భారీగా దోపిడీ
● జడ్పీ ఆదాయానికి గండి
● చోద్యం చూస్తున్న అధికారులు
అచ్చంపేట: లీజు కాలం పూర్తయింది.. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు.. అయినా నెలన్నర కాలంగా దర్జాగా బల్లకట్టు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జడ్పీ ఖజానాకు గండిగొడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారులెవ్వరూ ఇదేమిటని అడగరు.. ఆ ఛాయలకూ వెళ్లరు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలంలోని పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం రామన్నపేటకు ఎలాంటి నిబంధనలను పాటించకుండా, జిల్లా పరిషత్‌కు చెల్లించాల్సి సొమ్ము ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ప్రతి రోజు యథేచ్ఛగా కృష్ణానదిపై బల్లకటు తిప్పుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
వేలం జరగకుండా అడ్డుకున్న మాఫియా..
మండలంలోని పుట్లగూడెం నుంచి కృష్ణానదికి ఆవలిఒడ్డున ఉన్న రామన్నపేటకు బల్లకట్టుపై నుంచి పెద్ద పెద్ద వాహనాలు, ప్రయాణికులు, పశువులు, జీవాలు, నిత్యావసర వస్తువులు తరలించేందుకు ప్రతి యేటా మార్చి చివరలో గుంటూరు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహిస్తారు. గత ఏడాది పాట దక్కించుకున్నవారి లీజుకాలం ఈ ఏడాది మార్చి 30తో ముగిసింది. జిల్లా పరిషత్ అధికారులు తిరిగి టెండర్లు ఆహ్వానించి ఏప్రిల్ 8న బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే టెండర్లు వేయనీకుండా, బహిరంగ వేలంలో ఎవరూ పాల్గొననీయకుండా బల్లకట్టు మాఫియా అడ్డుకుంది. దీంతో బహిరంగ వేలాన్ని మే 8కి తిరిగి వాయిదా వేశారు. అప్పుడు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎవరికీ అనుమతులు దక్కలేదు. ఇదే అదనుగా కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదిలి యథావిధిగా బల్లకట్టును నడుపుతూ రూ.లక్షలు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్వాహకులు అడిగినంత చెల్లిస్తూ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా వసూలు చేస్తుండటంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అక్రమార్కుల జేబులు ఫుల్ అవుతున్నాయి.
జిల్లా పరిషత్ ఆదాయానికి భారీ గండి
అచ్చంపేట మండలంలో మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రం బొగ్గమాదారం వరకు, పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా రామన్నపేటకు బల్లకట్టు సర్వీసులు తిప్పుతారు. మాదిపాడు వద్ద నడిచే బల్లకట్టును తాత్కాలికంగా నిలిపివేశారు. ఏటా అచ్చంపేట మండలం నుంచే సుమారు పడవలపైనుంచి గానీ, బల్లకట్టు నుంచి గానీ జిల్లా పరిషత్‌కు రూ.60లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.5 లక్షలు. ఈ ఏడాది గత నెలన్నర కాలంగా అధికారికంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఆ ఆదాయానికి గండిపడింది. అనధికారంగా అక్రమార్జనలు జరుగుతూనే ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్ చేస్తాం.
– కోయ శ్రీనివాసరావు,
ఎంపీడీఓ, అచ్చంపేట
ప్రభుత్వ నిబంధనల మేరకు బల్లకట్టుపై ప్రయాణించే వ్యక్తికి 40కిలోల లగేజీతో సహా రూ.3 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. ద్విచక్రవాహనానికి వ్యక్తితో సహా రూ.15 వసూలు చేయాల్సి ఉంగా రూ.100, కారు, ఆటో, ట్రాక్టరు ట్రక్కుతో సహా రూ.180 వసూలు చేయాల్సి ఉండగా రూ.500, లారీకి రూ.240 వసూలు చేయాల్సి ఉండగా రూ.700వరకు, టెన్ టైర్, ట్వల్ టైర్ లారీలైతే రూ.1000 కూడా వసూలు చేస్తున్నారు.


