‘ఇంజినీరింగ్‌’ పరీక్షలకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

‘ఇంజినీరింగ్‌’ పరీక్షలకు వేళాయె!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

రేపటి నుంచి 20 వరకు

ఏపీ ఈఏపీసెట్‌–2026

12 నుంచి 18వ తేదీ వరకు

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు

19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌,

ఫార్మసీ ప్రవేశ పరీక్షలు

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా

హాజరు కానున్న 46,168

మంది విద్యార్థులు

మూడు జిల్లాల్లో

21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌–2026 (గతంలో ఎంసెట్‌) ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్‌, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్‌టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్‌–2026ను నిర్వహిస్తోంది.

● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో

46,168 మంది విద్యార్థులు

● ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు.

● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్‌ 28,158, అగ్రికల్చర్‌, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు.

● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్‌ 2,899, అగ్రికల్చర్‌, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు.

● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్‌ 7,684, అగ్రికల్చర్‌, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు.

విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి

● విద్యార్థులు ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్‌–2025 దరఖాస్తు ప్రింటవుట్‌ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి.

● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్‌ కాపీతోపాటు హాల్‌ టికెట్‌ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్‌ కలర్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్‌ హాల్‌ టికెట్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్‌ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు.

● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement