దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, వివాహ సుముహూర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొండపై రద్దీ తగ్గింది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు దుర్గమ్మ సన్నిధిలోని మహా మండపం మూడో అంతస్తులో వివాహాల సందడి కనిపించింది. వివాహాలైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే నాలుగు గంటల నుంచి అమ్మవారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో వైపు విజయవాడ నుంచి విశాఖపట్నం, చైన్నె, హైదరాబాద్ వైపు ఆరు గంటల సమయంలో రైళ్లు అందుబాటులో ఉండటంతో తెల్లవారుజామున రద్దీకి కారణమని తెలుస్తోంది. ఇక తెలంగాణ, చైన్నె, బెంగళూరు ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉదయానికి కల్లా నగరానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కావడమే కొండపై రద్దీకి కారణమని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం వేళ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు.దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తోడు నగరానికి చెందిన వారు సైతం సాయంత్రం అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. ఇక రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. దుర్గాఘాట్‌ను పరిశీలించిన ఈఓ శీనానాయక్ దేవస్థాన బస్సులో కొండపైకి చేరుకున్నారు. ఓం టర్నింగ్ వద్ద భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న భక్తులతో మాట్లాడారు. వేసవి నేపధ్యంలో దేవస్థానం భక్తులకు మంచినీటి సదుపాయం, మజ్జిగ పంపిణీ గురించి తెలిపారు.
పట్టణానికి చెందిన వ్యక్తి మృతి
చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు కింద ద్విచక్రవాహనం దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక చెందిన షేక్ బుజ్జి(41) బైక్‌పై చిలకలూరిపేట వైపుకు వస్తుండగా అదే సమయంలో చీరాల–సత్తెనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురైంది. ప్రమాదవశాత్తూ బుజ్జి బైక్ ఆర్టీసీ బస్సు ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. బుజ్జికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుజ్జి మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్‌లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్‌మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూడో అంతస్తులో వివాహాల సందడి
సాయంత్రం పెరిగిన రద్దీ
ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ