వినుకొండ: చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం అక్రమ మార్గాల్లో సంపాదించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వరికి బదులు ఆరుతడి, వాణిజ్య పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు భారీగా మొక్కజొన్న, పొగాకు సాగు చేస్తే తీరా గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. దీనివల్ల దళారులు రూ.1000 –రూ.1100లకే కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు చేసి ఒక్క రోజులోనే డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. అసలు ఎంత పంట పండింది, ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తితే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు, రూ.2.50 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని గుర్తు చేశారు. కానీ నేడు వినుకొండలో మట్టి, ఇసుక, మద్యం వంటి అక్రమ వ్యాపారాలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. వెంటనే పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్ ప్రసాదు, పట్టణ కన్వీనర్ కొత్తమాసు శివ, మండల కన్వీనర్లు దండు చెన్న య్య, కొండా వరుజు నాగేశ్వరరావు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, కాకర్ల నారాయణరెడ్డి బేతం గాబ్రియేలుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు


