రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాలి

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్‌ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రనన్స్‌ క్లబ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్‌న్స్‌ క్లబ్‌ ఏర్పాటు–నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకి ఐద్వా సీనియర్‌ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడు తూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్‌ విద్యావ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్‌ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్‌ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్‌ క్లబ్‌లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్‌ కమిటీ కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్‌ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు.

చిల్డ్రన్‌ ్స క్లబ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కె.రమాప్రభ

Advertisement
 
Advertisement
Advertisement