లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్‌లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే వాటి సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
సీహెచ్.బాబురావు


