శోక సంద్రమైన ఎండుగుంపాలెం | - | Sakshi
Sakshi News home page

శోక సంద్రమైన ఎండుగుంపాలెం

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్‌ఎస్‌పీ తుర్లపాడు మేజర్‌ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు (52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్‌ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్‌ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్‌ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి దుర్మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరవుతూనే తదుపరి విమానంలో తిరుగు ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్‌లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తుల అశ్రునయనాల మధ్య రామారావు అంత్యక్రియలు ముగియగా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్‌న్‌ఎస్‌పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement